సాధారణ వ్యక్తులు ఆధ్యాత్మిక జీవితాన్ని సాధించడం సులువేనా!

 

సాధారణ వ్యక్తులు ఆధ్యాత్మిక జీవితాన్ని సాధించడం సులువేనా?

ఆధ్యాత్మిక జీవితాన్ని తీవ్రతరం చేయడానికి మనం ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు. కేవలం ఆధ్యాత్మిక జీవితపు చరమ దశలోనే దానికి ప్రాముఖ్యం ఉంటుంది. అసలు మనకు ఆధ్యాత్మిక జీవితం గడపాలన్న కాంక్ష ఉందా లేదా? ఉంటే అది ఎంత తీవ్రంగా ఉంది అనేదే అతి ముఖ్యమైన అంశం. భగవంతునికై ప్రాకులాడని జీవతం నిరర్థకమని మనం ఎంత వరకు భావించగలుగుతున్నామనేదే మన ఆధ్యాత్మిక జీవితపు తీవ్రతను నిర్ధారిస్తుంది. మనం ఆశలు  ఐహిక సుఖాలతో తృప్తిపడుతున్నంత కాలం ఆధ్యాత్మికా పేక్షకు బలం చేకూరదు. జీవితంలో ఈ సాంసారిక విషయాలకు ప్రాముఖ్యాన్నిస్తున్నంత వరకు మన ఆధ్యాత్మిక జీవనం కేవలం సాంప్రదాయక రీతిలోనే ఉండిపోతుంది. ఈ మానసిక స్థాయినుంచి బయటపడినప్పుడే మనలో శ్రద్ధ ఉదయిస్తుంది. అప్పుడు భగవంతుడు, ఆధ్యాత్మిక జీవితం వంటివి మన జీవితంలో అతి ముఖ్యమైన అంశాలుగా రూపుదిద్దుకుంటాయి.

భగవంతుడు, ఆత్మ, పరలోకం వంటి విషయాలపట్ల అవగాహన కేవలం సాంప్రదాయక రీతిలోనే ఉన్న వ్యక్తి. 'శ్రద్ధ' వంటి అంశాలకు తగిన ప్రాధాన్యాన్నివ్వడు. దానికి బదులుగా అతడు తన ఆస్తిపాస్తులు, బంధుమిత్రులు ఇతర ఐహిక ప్రాకులాటలపట్ల మోజు చూపుతాడు. ఫలితంగా ఆధ్యాత్మిక జీవితంపై అతడు శ్రద్ధ కనబరచడు. కానీ ఎవరిలో శ్రద్ధ ఉదయిస్తుందో, అతని వైఖరి మార్పుచెంది ప్రస్తుత పరిస్థితికి పూర్తి విరుద్ధంగా తయారవుతుంది. తాను కోరిన ఆధ్యాత్మిక విలువల కొరకై అతడు తన సమయాన్ని, కృషిని, వనరులను వెచ్చించడానికి సిద్ధంగా ఉంటాడు. మనలోని శ్రద్ధ ఎంత ప్రగాఢంగా ఉందన్న దానిపై మన ఆధ్యాత్మిక జీవితపు తీవ్రత ఆధారపడి ఉంటుంది. మన ఆధ్యాత్మిక సాధనలు, వాటిలో మనం కృతకృత్యులమవడమనేది కూడా దానిపైనే ఆధారపడి ఉంటుంది. 

ఆత్మపరిశీలన, వివేకం, జీవితంలో అనుభవాలు నేర్పిన పాఠాల ద్వారా సాధుజీవనాన్ని గడుపుతున్న పుణ్యపురుషుల సాంగత్యం వలన మనలోని శ్రద్ధ స్థిరపడుతుంది. అన్నిటికంటే కూడా, భగవంతుడే జీవిత పరమాశ్రయమని భావించి జీవనాన్ని సాగించే పుణ్య పురుషుల సాంగత్యమే ఆధ్యాత్మిక కాంక్షను రగిల్చే మూలాధారం. తన బాధ్యతలలో భాగంగా పనులను నిర్విర్తించే ఆధ్యాత్మిక సాధకుడు సదా ఆ పరమాత్మని తన మదిలో ఉంచుకొని, అంతా ఆయన కార్యప్రణాళికగా భావిస్తూ వాటిని చేపట్టాలి. అప్పుడు మాత్రమే పని, ఆధ్యాత్మిక జీవితాల మధ్య ఉండే అంతరం తొలగి ఒక సమగ్ర ఆధ్యాత్మిక జీవితం నెలకొంటుంది.

సంసారంలో అనేక కార్యకలాపాలతో సతమతమయ్యే సాధకులకు అప్పుడప్పుడు వాటి నుంచి ఒకటి రెండు రోజుల విరామం తీసుకొని ఏకాంత ప్రదేశానికి వెళ్ళి సాధన చేయాలి. అటువంటి ప్రదేశాలు మన రోజువారీ వాతావరణానికి భిన్నంగా ఆధ్యాత్మిక సాధనలకు చాలా అనుకూలంగా ఉండడం వలన అక్కడ పూర్తిగా సాధనలతోనే సమయాన్ని గడపవచ్చును. ఇది మనలోని ఉత్సాహాన్ని పునర్జీవింపజేసి, మనలో నిష్కామ భావన నెలకొనేందుకు సహకరిస్తుంది.

పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా సదా భగవన్నామాన్ని మనసులోనే జపిస్తూ, ఆయనను స్మరించేందుకు ప్రయత్నించాలి. నిరంతరం అలా సాధనచేయడంవల్ల నామస్మరణ అప్రయత్నంగానే చెయ్యగలం. ఈ సాంసారిక విషయాలు అనిత్యమూ, తుచ్ఛమూ అనే విషయాన్ని వివేకంతో గ్రహించడం ద్వారా కూడా నిష్కామభావం పెంపొందించుకోవచ్చు.

                                     ◆నిశ్శబ్ద.